ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 3:43 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

స్వామీజీల ..పూజల పేరుతో ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు,

స్వామీజీల ..పూజల పేరుతో ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు,

మంథని ప్రజలకు కావాల్సింది పాదపూజలు కాదు.. అభివృద్ధి, ఉపాధి, సాగునీరు, సంక్షేమ పథకాల అమలు … బీఆర్ఎస్ నేత జక్కు శ్రావణ్ విమర్శ,

అర్జున్ సమాచారం ( అక్టోబర్ 31 ) మంథని డెస్క్.

మంథని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ కాటారం మండల అధికార ప్రతినిధి జక్కు శ్రావణ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే స్వామీజీలు, పీఠాధిపతుల పర్యటనలు, పూజా కార్యక్రమాలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో 420 హామీలు తానే రాశానని చెప్పుకున్న శ్రీధర్ బాబు, ప్రస్తుతం వాటి అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో మహిళలు, నిరుద్యోగ యువత, రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టకుండా గణపతి సచ్చిదానంద స్వామీజీని హెలికాప్టర్‌లో తీసుకువచ్చి పాదపూజల పేరుతో ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించారు.

ప్రాజెక్టులు, రహదారులపై నిర్లక్ష్యం.

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని, పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే విషయంలోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రావణ్ ఆరోపించారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రహదారులు గుంతలమయంగా మారినా పట్టించుకోవడం లేదన్నారు. దేవరాంపల్లి, ధన్వాడ రహదారుల మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులు, స్వామీజీ పర్యటన నేపథ్యంలో హడావుడిగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోందన్నారు.

మంత్రి సొంత మండలంలో ఇప్పటికీ సరైన బస్టాండ్ లేదని, యువత క్రీడల్లో రాణించేందుకు మినీ స్టేడియం కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. పొరుగు నియోజకవర్గాలతో పోలిస్తే మంథనిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదని, వ్యాపార రంగం కూడా మందగించిందని ఆరోపించారు.

హామీల అమలులో జాప్యం.. రైతులు, నిరుద్యోగుల ఇక్కట్లు,

రైతు భరోసా, రుణమాఫీ పథకాలు అర్హులైన రైతులందరికీ పూర్తిస్థాయిలో అందడం లేదని, వ్యవసాయానికి అప్రకటిత విద్యుత్ కోతలు ఇబ్బందిగా మారాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. నూతన వధువులకు తులం బంగారం, యువతులకు స్కూటీలు అందిస్తామన్న హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచలేదని, కొత్త పెన్షన్ల మంజూరులోనూ పురోగతి లేదన్నారు.

రాజీవ్ యువ వికాసం, రూ.5 లక్షల విద్యా భరోసా ఏటీఎం కార్డులు, దళితులకు అంబేద్కర్ అభయహస్తం, జాబ్ క్యాలెండర్ వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ మంథని నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలు తీసుకురాలేకపోయారని, దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేక అడ్డా కూలీలుగా మారుతున్నారని విమర్శించారు.

వైద్య సదుపాయాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నలు,

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపడలేదని, అత్యవసర సమయాల్లో సరిపడా అంబులెన్సులు అందుబాటులో ఉండటం లేదని అన్నారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కనీసం 30 పడకల ఆసుపత్రిగా లేదా మినీ మాతా శిశు కేంద్రంగా అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తమ సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రతిపక్ష నాయకులపై ఫిర్యాదులు చేయిస్తూ అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టుల ద్వారా భయపెట్టే రాజకీయాలకు పాల్పడుతున్నారని జక్కు శ్రావణ్ ఆరోపించారు. గతంలో నియోజకవర్గంలో మరణించిన దళిత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం, కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించడంలోనూ మంత్రి విఫలమయ్యారని విమర్శించారు. ఆలయాల కూల్చివేతలు, నిధుల మళ్లింపుపై కూడా ఆయన ఆరోపణలు చేశారు.

మంథని ప్రజలకు స్వామీజీల పాదపూజలు, ప్రవచనాలు, ప్రచార కార్యక్రమాల కంటే సాగునీరు, తాగునీరు, ఉపాధి, మెరుగైన రహదారులు, వైద్య సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలే ముఖ్యమని జక్కు శ్రావణ్ అన్నారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి దృష్టి మళ్లించే రాజకీయాలు చేయకుండా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చాలని మంత్రి శ్రీధర్ బాబును డిమాండ్ చేశారు. జక్కు శ్రావణ్ బీఆర్ఎస్ పార్టీ కాటారం మండల అధికార ప్రతినిధి.